ఏపీ అసెంబ్లీ లోబీల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జగన్ తన పార్టీ సభ్యులతో కలిసి వస్తుండగా తారసపడిన దువ్వాడను ఉద్దేశించి "వాట్.. శీనూ ది గ్రేట్" అంటూ జగన్ ఆత్మీయంగా పలకరించారు. వెంటనే జగన్ కాళ్లకు నమస్కరించిన దువ్వాడను భుజం తట్టి నిమిరిన జగన్.. "ఇంకా సినిమా హీరోలాగే చేస్తున్నావా? బిజినెస్‌లు అవీ బానే ఉన్నాయా? అసలు ఫ్యామిలీ రచ్చ ఎందుకు చేసుకుంటున్నావు?" అని నేరుగా ప్రశ్నించారు. దీనికి స్పందించిన దువ్వాడ, తన వ్యక్తిగత సమస్యలన్నీ చక్కదిద్దుకుంటున్నానని బదులిచ్చారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి జగన్ ఆరా తీయగా.. "నేనెక్కడికి వెళ్తాను, మీరేం చెబితే అదే చేస్తాను. ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడతాను" అని దువ్వాడ కోరారు. దానికి జగన్ "సరే చూద్దాం" అంటూ ముందుకు సాగారు. ఈ సంభాషణ జరుగుతున్నంత సేపు లోబీల్లో ఉన్నవారంతా ఆసక్తిగా గమనించారు. పార్టీ నుంచి సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ జగన్ ఆయనతో చనువుగా మాట్లాడటం, వ్యక్తిగత విషయాలపై ఆరా తీయడం చర్చనీయాంశమైంది. అనంతరం మీడియాతో మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్, ఒకవేళ పార్టీ తనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తేయకపోతే ఏం చేస్తారని విలేకరులు ప్రశ్నించగా.. "ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఒకవేళ జగన్ గారు అవకాశం ఇవ్వకపోతే, నా దారి నేను చూసుకుంటాను.. సొంతంగానే పోటీ చేస్తాను" అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. పార్టీ నిర్ణయం ఏదైనా తన రాజకీయ ప్రయాణం మాత్రం ఆగేది లేదని ఆయన సంకేతాలిచ్చారు.