పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు భారత్ సహా ఐదు మిత్ర దేశాల నౌకలకు అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఈ జాబితాలో భారత్‌తో పాటు చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్‌లు ఉన్నాయి. ఇరాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న దౌర్జన్యాలకు మద్దతు ఇవ్వని దేశాలకు మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఈ వివరాలను ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో హర్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత సరకు రవాణా నౌకలకు మార్గం సుగమమైంది. ముఖ్యంగా, గత కొద్ది రోజులుగా అనుమతుల కోసం ఎదురుచూస్తున్న ఐదు గ్యాస్ ట్యాంకర్లు ఇప్పుడు తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ జలసంధి గుండా ప్రయాణం పునఃప్రారంభం కావడంతో భారత్‌కు ఇంధన సరఫరాలో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోనున్నాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్య పరంగా భారత్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం. మరోవైపు, హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై 'టోల్' (రుసుము) విధించే దిశగా ఇరాన్ పార్లమెంట్ కసరత్తు చేస్తోంది. ఈ టోల్ వసూలు చేసినందుకు ప్రతిగా, ఆయా నౌకలకు ఇరాన్ సైన్యం పూర్తి భద్రత కల్పిస్తూ జలసంధిని దాటించనుందని సమాచారం.
Share