Current Date: 27 Mar, 2026

షేన్ వార్న్ చనిపోయినా.. ఐపీఎల్ నుంచి కుటుంబానికి రూ. 460 కోట్లు ఆదాయం

ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం, దివంగత షేన్ వార్న్ గతంలో చేసిన ఒక వినూత్న ఒప్పందం ఇప్పుడు ఆయన కుటుంబానికి భారీ సంపదను తెచ్చిపెడుతోంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008)లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వార్న్ తన కాంట్రాక్ట్‌లో ఒక ప్రత్యేక నిబంధనను చేర్చుకున్నారు. దీని ప్రకారం, ఆయన ఫ్రాంచైజీ తరఫున ఆడిన ప్రతి సీజన్‌కు గానూ యాజమాన్యంలో 0.75 శాతం వాటా దక్కేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా నాలుగు ఏళ్ల పాటు కెప్టెన్‌గా, మెంటార్‌గా వ్యవహరించడంతో వార్న్‌కు మొత్తం 3 శాతం వాటా లభించింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఈ ఫ్రాంచైజీని దాదాపు రూ. 15,300 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ భారీ డీల్ ప్రకారం, వార్న్‌కు ఉన్న 3 శాతం వాటా విలువ సుమారు రూ. 460 కోట్లుగా తేలింది. ఐపీఎల్ ముగిసిన తర్వాత బీసీసీఐ ఈ ఒప్పందానికి ఆమోదం తెలపగానే అమ్మకం ప్రక్రియ పూర్తవుతుంది.2022లో షేన్ వార్న్ మరణించినప్పటికీ, ఆయన అప్పట్లో చూపిన ముందుచూపు వల్ల ఇప్పుడు ఈ భారీ మొత్తం ఆయన వారసులకు అందనుంది. మొదటి ఐపీఎల్ సీజన్‌లో అంతగా అంచనాలు లేని రాజస్థాన్ రాయల్స్ జట్టును విజేతగా నిలిపి చరిత్ర సృష్టించిన వార్న్, మైదానంలోనే కాకుండా వ్యాపార పరంగానూ తన తెలివితేటలను నిరూపించుకున్నారు. ఆనాడు నామమాత్రపు విలువతో ఉన్న వాటా, నేడు వందల కోట్లకు చేరడం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఈ విక్రయం పూర్తయితే ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఆటగాడికి లేదా వారి కుటుంబానికి దక్కిన అత్యధిక లాభాల్లో ఇది ఒకటిగా నిలవనుంది .