రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సింహాద్రి అప్పన్నకు మొక్కుతీర్చుకున్నారు. మెట్లెక్కి కొండకు వెళ్లి సింహాచలేశుని దర్శనం చేసుకున్నారు. తొలిపాంచా వద్ద ఈఓ శ్రీనివాసమూర్తి మంత్రికి స్వాగతం పలికారు. తొలిమెట్టు వద్ద అప్పన్న నమూనా విగ్రహానికి పూజలు చేసి టెంకాయ కొట్టి కుటుంబ సమేతంగా మంత్రి మెట్లెక్కారు. మధ్యలో ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని అర్చన చేయించుకున్నారు. అక్కడ నుండి మరికొన్ని మెట్లెక్కి ప్రకృతి జలధార చాకిధార వద్ద తీర్థాన్ని ప్రోక్షణ చేసుకుని కొండకు చేరుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద అర్చక పెద్దలతో కలిసి ఈఓ సంప్రదాయంగా స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి మనసులోని కోర్కెలను స్వామివారికి నివేదించుకున్నారు. అంతరాలయంలో అర్చకులు మంత్రి పేరున అష్టోత్తర శతనామార్చన చేశారు. గోదాదేవి సన్నిధిలో మంగళహారతులిచ్చారు. బేడా మండపం లో మంత్రిని ఆశీనులను చేసి నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ఆశీర్వాదం చేశారు. స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను ఈఓ మంత్రికి అందించారు.