సింహాద్రినాధుడి సోదరి, ఏడు గ్రామాల ప్రజల పొలిమేర దేవతగా విరాజిల్లుతున్న సత్తమ్మతల్లి (మరిడిమాంబ) పండగను ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఈ పండగను వివిధ గ్రామాల ప్రజలు వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఆదివారం తెల్లవారు జామున సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొలిపి ఆరాధన గావించనున్నారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్నం అడవివరం నుంచి గ్రామస్తులంతా అమ్మవారి ప్రతిమను భారీ ఊరేగింపు నడుమ ఇక్కడ ఆలయం వద్దకు తీసుకు వస్తారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని పసుపు, కుంకమలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ అభివృద్ధి కమిటీ చేపట్టింది. కమిటీ గౌరవాధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షులు పి.వెంకటరావు, ఉపాధ్యక్షులు గంట్ల కనకరాజు, సంయుక్త కార్యదర్శి బలిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.