Current Date: 02 Mar, 2026

ప్రపంచ కుబేరుడు మస్క్‌కి కొత్త కష్టం.. డబ్బు ఉన్నా ఏం లాభం?

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సుమారు రూ. 71 లక్షల కోట్లు భారీ సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించిన మస్క్, సంపదపై చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. "డబ్బుతో సంతోషాన్ని కొనలేము అని ఎవరు అన్నారో కానీ వారు చెప్పింది అక్షరాలా నిజం" అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ వింతైన ప్రకటనకు మస్క్ ఒక విచారకరమైన ఎమోజీని కూడా జత చేయడంతో, వేల కోట్లు ఉన్నా ఆయన మనశ్శాంతిగా లేరా? అన్న సందేహాలు వెల్లువెత్తాయి. స్పేస్ ఎక్స్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ 'xAI'ని కొనుగోలు చేసిన తర్వాత మస్క్ సంపద అమాంతం పెరిగి మొట్టమొదటిసారిగా 800 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇంతటి చారిత్రాత్మక విజయం అందుకున్న కొద్ది రోజులకే ఆయన ఇలాంటి నిరాశాజనకమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మస్క్ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "అద్దె కట్టాల్సిన అవసరం లేనివారికి ఇలాంటి వేదాంతం చెప్పడం సులభమే" అని కొందరు ఎద్దేవా చేయగా, మరికొందరు "నాకు ఒక మిలియన్ డాలర్లు పంపండి, అప్పుడు సంతోషం వస్తుందో లేదో నేనే పరీక్షించి చెబుతాను" అంటూ జోకులు పేలుస్తున్నారు. డబ్బు సౌకర్యాలను ఇస్తుంది కానీ, మానసిక ప్రశాంతతను ఇవ్వలేదన్న మస్క్ మాటలు ఇప్పుడు గ్లోబల్ లెవల్లో వైరల్ అవుతున్నాయి.