ఐపీఎల్ ముగిసిన కొద్దిరోజులకే భారత క్రికెట్ జట్టు మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌కు సిద్ధమైంది. చండీగఢ్‌లోని కొత్త పిసిఎ స్టేడియంలో శనివారం నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగబోయే ఏకైక టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమ్ఇండియా తలపడనుంది. గత నవంబరులో దక్షిణాఫ్రికాతో టెస్టు ఆడిన తర్వాత భారత్ మళ్లీ తెల్ల దుస్తుల్లో బరిలోకి దిగడం ఇదే తొలిసారి. సొంతగడ్డపై బలమైన రికార్డు ఉన్నప్పటికీ, ఇటీవల న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఎదురైన పరాభవాల నేపథ్యంలో ఈ కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. రోహిత్, కోహ్లి, అశ్విన్ వంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయిలో రూపాంతరం చెందుతున్న భారత జట్టుకు ఈ మ్యాచ్ ఒక కీలక పరీక్ష. పైగా ఈ మ్యాచ్ నుండి జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చారు. స్పిన్ విభాగాన్ని ముందుండి నడిపించే బాధ్యత కుల్దీప్ యాదవ్‌పై పడగా, జడేజా లోటును భర్తీ చేసేందుకు ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ సిద్ధమయ్యాడు. పేస్ దళానికి మహ్మద్ సిరాజ్ సారథ్యం వహించనుండగా, బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, పంత్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి.టెస్టుల్లో కేవలం 12 మ్యాచ్‌ల అనుభవమే ఉన్న అఫ్గానిస్థాన్ జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఆ జట్టుకు ప్రధాన స్పిన్నర్ రషీద్ ఖాన్ అందుబాటులో లేకపోవడం పెద్ద లోటే అయినప్పటికీ, రహ్మనుల్లా గుర్బాజ్, సెదిఖుల్లా అటల్ వంటి టీ20 హీరోలతో బ్యాటింగ్ లైన్అప్ పటిష్టంగా ఉంది. కెప్టెన్ హస్మతుల్లా షాహిది, రహ్మత్ షాలు జట్టుకు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు.