Current Date: 04 Jul, 2024

ఐపీఎల్‌లో ముంబయి ప్లేఆఫ్ ఆశలు గల్లంతు.. ఇక సర్దుకోవడమే!

పీఎల్ 2024లో ముంబయి ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కేవలం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ముంబయి టీమ్ 24 పరుగుల తేడాతో పేలవంగా ఓడిపోయింది. దాంతో ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ముంబయి గెలిచినా.. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కి చేరడం అసాధ్యం. ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్‌ గెలిచిన ముంబయి టీమ్ పేలవంగా ఇలా నిష్క్రమించడం అభిమానుల్ని బాధించేదే.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీమ్‌లో వెంకటేశ్ అయ్యర్ 70 పరుగులు చేయడంతో ఆ జట్టు 169 పరుగులకి ఆలౌటైంది. ఆ తర్వాత ఛేదనలో ముంబయి టీమ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే 145 పరుగులకి కుప్పకూలిపోయింది. ముంబయి జట్టులో సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే 56 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. పవర్ హిట్టర్లతో నిండిన ముంబయి టీమ్ 150 పరుగులు కూడా చేయలేకపోవడం గమనార్హం.

సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన ముంబయి టీమ్ ఎనిమిదింట్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చిట్టచివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు చేరతాయి. కానీ.. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే కనీసం 16 పాయింట్లు ఉండాలి. కాబట్టి.. ముంబయి ఇక సర్దుకోవడమే మిగిలింది.