రండి కదలి రండి పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజా ఉద్యమ ర్యాలీ ప్రారంభమైంది. అశేష జన వాహినితో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని నినాదాలతో బుధవారం ఉదయం డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుండి వందలాది మంది భారీ ర్యాలీగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సాగింది. ర్యాలీకి ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయత్రను ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వీవీ రమణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ రఘు వర్మ, నాగార్జున యూనివర్సిటీ మాజీ ఉపకులపతి బాల మోహన్ దాస్, తదితర నాయకులు ప్రారంభించారు. ఈ భారీ ర్యాలీలో విశాఖలోని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కళాకారులు, ఏయూ విశ్రాంత ఆచార్యులు. విజయనగరం, శ్రీకాకుళం, భీమిలి తదితర ప్రాంతాల నుండి మహిళా, దళిత, యువజన, విద్యార్థి సంఘాల నాయకులు, ఆయా ప్రాంతాలవాసులు భారీగా తరలివచ్చారు. దీంతో ఒక్కసారిగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వందలాదిమంది ఉద్యమకారులతో ఆనాటి విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఉద్యమ స్ఫూర్తి ప్రజ్వరిల్లింది.
Share