దూసుకు వస్తున్న ‘దానా’ తుపాను.. ఏపీలో వర్షాలు పడే అవకాశం
Oct 23, 2024
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న ఉదయం వాయుగుండంగా, సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఈరోజు తుపానుగా, రేపు తెల్లవారుజామున తీవ్ర తుపానుగా రూపాంతరం చెందవచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తీవ్ర తుపాను ‘దానా’ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఏపీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను ఐఎండీ అప్రమత్తం చేసింది. రేపు అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం లోపు పూరీ, సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటవచ్చని ఐఎండీ అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ తుపాను ప్రభావం ఏపీపై ఉండకపోవచ్చని ఐఎండీ మాజీ డీజీ డాక్టర్ కేజే రమేశ్ తెలిపారు. ప్రస్తుత అంచనా ప్రకారం ఒడిశా, పశ్చిమబెంగాల్, స్థానిక పరిస్థితుల వల్ల గమనం మార్చుకుంటే బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చని, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.