Current Date: 07 Apr, 2026

ఇరాన్‌కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్.. మాట వినకపోతే లేపేస్తాం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. హర్మూజ్ జలసంధిని తక్షణమే అంతర్జాతీయ నౌకల రాకపోకలకు తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను నామరూపాల్లేకుండా చేస్తామని భీకర హెచ్చరికలు జారీ చేశారు. నిర్దేశించిన గడువులోపు స్పందించకుంటే ఇరాన్‌కు 'నరకం' చూపిస్తామని, ఒక్క దెబ్బతో కీలక వ్యవస్థలను కూల్చేస్తామని తన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కి ఇచ్చిన హెచ్చరిక ఈరోజుతో ముగియనుంది. శత్రు భూభాగంలో గల్లంతైన అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమాన పైలట్‌ను సాహసోపేతమైన ఆపరేషన్ ద్వారా సురక్షితంగా కాపాడామని ట్రంప్ ప్రకటించారు. గాయపడినప్పటికీ ఆ కర్నల్ ధైర్యంగా పోరాడారని, శత్రువుల చెంతకు చేరకుండా అతడిని రక్షించడం అమెరికా సైనిక చరిత్రలోనే గొప్ప విజయమని కొనియాడారు. ఇరాన్ గగనతలంపై తమకు పూర్తి ఆధిపత్యం ఉందని, తమ సైనికుడిని ఒక్కడిని కూడా శత్రు భూభాగంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అమెరికా జరిపిన భారీ దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు కీలక సైనిక ఉన్నతాధికారులు మృతి చెందినట్లు ట్రంప్ వెల్లడించారు. అత్యంత ఆధునిక ఆయుధాలతో కూడిన డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని, 24 గంటల పాటు పైలట్ లొకేషన్‌ను గమనిస్తూ ఈ విజయాన్ని సాధించామని తెలిపారు.