భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో ప్రపంచకప్‌ను గెలుచుకున్న మధుర క్షణాలను పంచుకున్నారు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్‌గా తనను ఎంపిక చేస్తారని ఊహించలేదని, జై షా తనకు బాధ్యతలు అప్పగించిన వెంటనే కోచ్ గౌతమ్ గంభీర్‌తో కలిసి విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్ సిద్ధం చేశామని తెలిపారు. ద్వైపాక్షిక సిరీస్‌ల మాదిరిగానే ఐసీసీ టోర్నీల్లోనూ దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నామని, వ్యక్తిగత రికార్డుల కంటే టీమ్ విజయం కోసమే ప్రతి ఒక్కరూ శ్రమించారని ఆయన పేర్కొన్నారు. టోర్నీ ఆరంభంలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమి తమ జట్టును పూర్తి స్థాయిలో మేల్కొలిపిందని సూర్యకుమార్ వెల్లడించారు. ఆ తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్‌ను నాకౌట్‌గా భావించి పోరాడామని, కోచ్ గంభీర్ సూచనల ప్రకారం వంద మ్యాచ్‌లు గెలిచినా లేకపోయినా ఫైనల్లో నెగ్గడమే చరిత్రగా నిలుస్తుందని బలంగా నమ్మామని చెప్పారు. ప్రారంభంలో సంజూ శామ్సన్ వైఫల్యంపై మాట్లాడుతూ.. తన ఆట కోసం అతను ఓపికగా ఎదురుచూశాడని, చివరి మూడు మ్యాచ్‌లలో జట్టు కోసం అతను ఆడిన తీరు అమోఘమని ప్రశంసించారు. వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోవడం తన జీవితంలోనే మర్చిపోలేని అద్భుత క్షణమని, ఆ సమయంలో తానూ నమ్మలేక తన చెంపపై తానే కొట్టుకున్నానని సూర్య గుర్తుచేసుకున్నారు. మైదానంలో అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్, 2024 ఫైనల్లో తాను పట్టిన క్యాచ్‌ను గుర్తుకు తెచ్చిందని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా మ్యాచ్ అనంతరం వీడియో అనలిస్ట్ రూపొందించిన 'సాహోరే బాహుబలి' స్ఫూర్తిదాయక వీడియో తమలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
Share