అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం గూడూరు గ్రామస్థులు తమ ఊరి పిల్లల ఆరోగ్యం కోసం ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లు రాకూడదంటూ వారు ఏకంగా నిషేధం విధించారు. ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించి గ్రామంలో ఐస్‌క్రీంలు అమ్మితే రూ. 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ ఊరి పొలిమేరలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్థుల ఆందోళనకు ప్రధాన కారణం ఐస్క్రీంల తయారీలో వాడుతున్న నాణ్యత లేని పదార్థాలే. కొందరు వ్యక్తులు సొంతంగా ఐస్‌క్రీంలు తయారు చేసి బండ్లపై తీసుకొచ్చి విక్రయిస్తున్నారని, వాటిని తిన్న చిన్నారులు దంత సమస్యలు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఐస్క్రీంలలో ఎలాంటి రసాయనాలు కలుపుతున్నారో తెలియకపోవడం వల్ల, భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యం మరింత దెబ్బతినకూడదనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు వారం క్రితమే ఈ తీర్మానం చేశారు. గూడూరు గ్రామస్థులు ఇలాంటి సామాజిక నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా గ్రామంలోని మద్యం బెల్ట్ దుకాణాలను ఊరి పెద్దలు ఏకతాటిపైకి వచ్చి తొలగించి తమ పట్టుదలను చాటుకున్నారు. ఒక కుగ్రామం తమ ఆరోగ్యం కోసం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇతర గ్రామాలకు కూడా స్ఫూర్తినిస్తోంది.
Share