బీజేపీ ఎంపీ, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా 'ఎమర్జెన్సీ' జూలైలోనే విడుదల కావాలి. కానీ.. ఊహించని విధంగా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. అయితే తాజాగా తన అభిమానులకు కంగనా రనౌత్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేసినట్లు ట్విటర్ ద్వారా ప్రకటించింది. మా చిత్రబృందం సెన్సార్ పూర్తి చేసుకుందని త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఈ విషయంలో మీ సహనానికి, మద్దతుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జన్సీ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై ఓ వర్గం సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను చెడుగా చిత్రీకరించారంటూ ఈ చిత్రంపై కాంగ్రెస్ వారు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా సెన్సార్ బోర్డ్ సైతం కొన్ని సీన్స్ కట్ చేయాలని చిత్రబృందానికి సూచించింది. అందువల్లే ఎమర్జెన్సీ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకోవడంతో త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.
Share