పైరసీ వెబ్‌సైట్ 'ఐబొమ్మ' కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవికి అలియాస్ ఐబొమ్మ రవికి హైకోర్టులో ఊరట లభించింది. సినిమాల పైరసీకి పాల్పడుతున్నారనే ఆరోపణలతో అరెస్టయిన అతనికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అతను అరెస్టయి 90 రోజులు గడిచినా, దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బెయిల్ పిటిషన్‌ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని కోర్టుకు విన్నవించారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, చట్టపరమైన నిబంధనల ప్రకారం 90 రోజుల్లోగా ఛార్జ్‌షీట్ వేయని పక్షంలో నిందితుడికి లభించే డిఫాల్ట్ బెయిల్ హక్కును పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు చేస్తూనే కోర్టు కఠినమైన షరతులను విధించింది. రూ. 25 వేల వ్యక్తిగత బాండ్, మరో ఇద్దరు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అలాగే, అభియోగపత్రం దాఖలు చేసే వరకు ప్రతిరోజూ ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల మధ్య దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది.