Current Date: 19 Feb, 2026

టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం.. ఏం దోచుకెళ్లారంటే?

పొన్నూరు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో భారీ చోరీ జరిగింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు లోపలికి చొరబడి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో సుమారు 50 తులాల బంగారం, 10 కిలోల వెండితో పాటు లక్ష రూపాయల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో ప్రమీలాదేవి తన కుమారుడు నరేంద్ర ఇంట్లో ఉండటంతో ప్రమాదం తప్పింది. తిరిగి వచ్చి చూసేసరికి సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించిన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుని సొత్తును రికవరీ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యే తల్లి ఇంట్లోనే ఇంత భారీ స్థాయిలో దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై విమర్శలకు దారితీస్తోంది. ప్రజాప్రతినిధుల కుటుంబాలకే రక్షణ లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.