Current Date: 18 Mar, 2026

సుప్రీంకోర్టులో గుట్టలుగా పేరుకుపోయిన పిటిషన్లు.. 42 ఏళ్లుగా తేలని పిల్స్!

సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రస్తుతం సుప్రీంకోర్టులో 3,525 పిటిషన్లు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇందులో 698 కేసులు పదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉండగా, 1984లో ఎం.సి. మెహతా దాఖలు చేసిన ఒక పర్యావరణ సంబంధిత కేసు గత 42 ఏళ్లుగా విచారణ దశలోనే ఉంది. రాజ్యాంగపరమైన అంశాలను చూడాల్సిన అత్యున్నత న్యాయస్థానంపై ఈ పిటిషన్లు అదనపు భారాన్ని పెంచుతున్నాయి. కోర్టులో పేరుకుపోయిన ఈ కేసుల్లో అత్యధికం పర్యావరణం, భూ చట్టాలు, వ్యవసాయ కౌలు వివాదాలకు సంబంధించినవే. గత ఐదేళ్లలో సుప్రీంకోర్టు 1,872 పిటిషన్లను పరిష్కరించినప్పటికీ, కొత్తగా వచ్చే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా 2025 సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 570 పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో సుప్రీంకోర్టులో ఉన్న మొత్తం కేసుల సంఖ్య 80,000 మార్కును దాటడం గమనార్హం. మరో విచారకరమైన అంశం ఏమిటంటే, కొన్ని కేసుల్లో పిటిషన్లు దాఖలు చేసిన వారు మరణించినా ఆ వ్యాజ్యాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 1995 నాటి మొహమ్మద్ హషీమ్ కేసు, 1997 నాటి హరధన్ రాయ్ కేసు వంటి వాటిలో పిటిషనర్లు చనిపోయినా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి రాష్ట్ర ప్రభుత్వాల వరకు అనేక సంస్థలు, వ్యక్తులు దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండటం న్యాయవ్యవస్థపై ఒత్తిడిని పెంచుతోంది.