Current Date: 04 Jul, 2024

మంత్రాలకు ముఖ్యమంత్రులు అవుతారా?

‘మాణిక్య వీణాముపలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం, 
మాతంగ కన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే, 
కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే
నమస్తే! జగదేక మాతః జగదేక మాతః ...ఆ...
మాతా...! మరకత శ్యామా! మాతంగీ మధుశాలినీ!
కుర్యాత్కటాక్షం కళ్యాణీ! కదంబ వనవాసినీ...!
జయ మాతంగ తనయే...! జయ నీలోత్పలద్యుతే!
జయ సంగీత రసికే!  జయ లీలా శుకప్రియే...! నమో రాజ్య శ్యామలా’’ అంటూ ఆ దేవి అంశ మాతంగిని పఠిస్తూ, ఏభై మంది రుత్వికులతో యజ్ఞయాగాలు ఘనంగా చేసేస్తే ఆ దేవి కరుణించి ‘రాజ్యాధికారాన్ని’ ప్రసాదించేస్తుందా? సీఎం కానీ, పీఎం కానీ అయిపోవడం ఇంత సులభమా? జనామోదం లేకుండా జగజ్జననీ ఆశీస్సులతో జననేత కాగలమా? ‘మంత్రాలకు చింతకాయలు రాలతాయా..?’ అన్నది సామెత. కానీ సీఎంలు కూడా అవుతారా? అన్న సందేహం అందరిలో కలుగుతోంది.
ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఎందుకు ఉదయిస్తున్నాయంటే ఉన్న అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడానికి జగన్‌, కోల్పోయిన అధికార వైభవాన్ని తిరిగి పొందడానికి చంద్రబాబు ఇద్దరూ ‘రాజ శ్యామల’ యాగాలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మరి మాతంగిదేవి ఎవరిని కరుణించి పదవీపగ్గాలు అందజేస్తుంది? అయితే ఇరవై రోజుల్లో అమ్మవారి దయ ఎవరికుందో తెలిసిపోతుంది.