బిహార్‌లోని ఓ సాధారణ యువకుడికి ఊహించని అదృష్టం, అంతకంటే పెద్ద షాక్ ఎదురైంది. గయా జిల్లా మస్త్‌పురా గ్రామానికి చెందిన వికాస్ కుమార్ అనే యువకుడి బ్యాంకు ఖాతాలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఏకంగా రూ. 294 కోట్లు జమయ్యాయి.వృత్తిరీత్యా ప్లంబర్, ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ నెలకు కేవలం రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు సంపాదించుకునే ఆ యువకుడు.. తన అకౌంట్లో అంత భారీ మొత్తాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. జూన్ 4న వికాస్ కుమార్ తన 'జియో పేమెంట్స్ బ్యాంక్' అకౌంట్‌ను పరిశీలించగా, మొదట అందులో రూ. 94 కోట్లు ఉన్నట్లు చూపించింది. ప్రారంభంలో ఇది ఏదైనా సాంకేతిక తప్పిదం (టెక్నికల్ గ్లిచ్) అయి ఉంటుందని అతడు భావించాడు. అయితే, అదే రోజు సాయంత్రం మరింత స్పష్టత కోసం ఓ ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి మరీ తనిఖీ చేసుకోగా.. ఈసారి ఆ మొత్తం ఏకంగా రూ. 294 కోట్లకు చేరింది. భయపడిపోయిన అతడు వెంటనే ఆన్లైన్ ద్వారా ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అలాగే బోధ్‌గయా సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.