ప్రముఖ అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. గత 12 నెలల కాలంలోనే ఏకంగా 21,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు కంపెనీ తన తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది. సంస్థ రోజువారీ కార్యకలాపాలలోAI సాంకేతికతను పెద్ద ఎత్తున భాగం చేయడమే ఈ లేఆఫ్‌లకు ప్రధాన కారణమని కంపెనీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, రాబోయే రోజుల్లోనూ ఈ ఉద్యోగాల కోతలు మరికొంత కాలం కొనసాగుతాయని ఒరాకిల్ పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వరుస తొలగింపుల తర్వాత ఒరాకిల్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,41,000కు పడిపోయింది. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో 49 వేల మంది అమెరికాలో విధులు నిర్వహిస్తుండగా.. మిగిలిన 92 వేల మంది ఉద్యోగులు వివిధ విదేశీ బ్రాంచ్‌లలో పనిచేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో క్లౌడ్, డేటా సెంటర్ల రంగంలోని అగ్రగామి సంస్థలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లతో పాటు ఒరాకిల్ కూడా వ్యయాలను తగ్గించుకోవడానికి ఏఐ మోడల్స్ వినియోగంపైనే తీవ్రంగా మొగ్గు చూపుతోంది. డేటా సెంటర్ల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒరాకిల్ సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నగదును ఆదా చేసుకోవడంతో పాటు, సంస్థ అంతర్గత కార్యకలాపాల పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగానే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ విశ్లేషిస్తోంది.