ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన బ్యాటింగ్ పవర్‌తో తొలి విజయాన్ని నమోదు చేసింది. గత మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా ఓటమి ఎదురవ్వగా, ఈసారి కోల్‌కతాపై పక్కా ప్రణాళికతో గెలుపు బోణీ కొట్టింది. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసకర ఆరంభాన్ని ఇవ్వగా, క్లాసెన్ అర్ధసెంచరీతో మెరిశాడు. ఫలితంగా హైదరాబాద్ ఈ సీజన్లోనే అత్యధిక స్కోరును సాధించి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో కోల్‌కతా నైట్‌రైడర్స్ 16 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది.ఈ మ్యాచ్‌లో ఆంధ్ర క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. గత సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన తను, ఈసారి కీలక సమయంలో బ్యాట్‌తో మెరుపులు మెరిపించాడు. కేవలం పరుగులే కాకుండా, బౌలింగ్‌లోనూ అత్యంత ప్రమాదకరమైన రింకూ సింగ్ వికెట్ తీసి మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పాడు. జట్టు విజయంలో ఒక తెలుగు ఆటగాడు కీలక పాత్ర పోషించడం అభిమానులకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. రఘువంశీ పోరాడినప్పటికీ, మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో కోల్‌కతా లక్ష్యానికి చాలా దూరంలోనే నిలిచిపోయింది. విశేషమేమిటంటే.. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో టాస్ గెలిచి ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించగా, ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలిసారి గెలుపొందడం గమనార్హం.