Current Date: 05 Oct, 2024

2025 జూన్ నాటికి రామాయపట్నం పోర్టు పూర్తికి చర్యలు

రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని ప్రారంభ సమయంలో అనుకున్న విధంగా 2025 జూన్ నాటికి పూర్తిచేసేలా సంబంధిత అధికారులకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. పోర్టు నిర్మాణ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఉమ్మడి సమీక్ష నిర్వహించారు. పోర్టు నిర్మాణం పనులపై మంత్రులకు కాంట్రాక్టర్లు, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు చేసిన పనుల వివరాలను, చేయాల్సిన పనుల వివరాలను, పెండింగ్ పనులకు సంబంధించిన పలు సమస్యలను మంత్రుల దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ..ముఖ్యమంత్రి చంద్రబాబు రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్న విషయాన్ని అధికారులకు వివరించారు. పోర్టు నిర్మాణంలో నెలకొన్న వివిధ అడ్డంకులు, సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

Share