Current Date: 25 Nov, 2024

డ్రగ్స్‌ కేసులో సీబీఐ నవ్వులపాలు

విశాఖ పోర్టుకు వేల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ చేరాయని దేశవ్యాప్తంగా హడలెత్తించిన ‘సీబీఐ’ ఇప్పుడు ఎందుకు నోరు మూసుకుని కూర్చుంది? 2024 మార్చి 21వ తేదీన ఆపరేషన్‌ గరుడ పేరుతో ఢల్లీి నుంచి వచ్చిన సీబీఐ బృందం నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ను కలిపిన 25 వేల టన్నుల ఇనాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడిరచి కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే. ఢల్లీి నుంచి విశాఖవచ్చిన సీబీఐ అధికారులు చేసిన హడావుడితో దేశ వ్యాప్తంగా అందరూ విశాఖ వైపు చూసారు. డ్రగ్‌ మాఫియాకు విశాఖ కేంద్రం అయిపోయిందనే ఆరోపణలు సర్వత్రా వినిపించాయి. ఇదే సమయంలో ఈ సరుకువైసీపీకి చెందిన వారిదేనని, ఏపీని డ్రగ్స్‌ కేంద్రంగా మార్చేశారని టీడీపీ, బీజేపీలు తీవ్ర ఆరోపణలు చేసాయి. కాదు.. కాదు ఇది బీజేపీ నాయకురాలు పురందేశ్వరి బంధువుల  పనే నంటూ వైసీపీ నాయకులఆరోపించారు. ఈ సరకు ఖరీదు లక్ష కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా కూడా వేసేశారు. వైసీపీ తన ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బంధువులే ఈ సరుకును దిగుమతి చేసుకున్నారని పదేపదే బహిరంగ సభల్లో  మాట్లాడుతూ ఆరోపించింది. ముఖ్యమంత్రి స్థాయిలో తగిన సమాచారాన్ని రప్పించుకోకుండానే జగన్‌ కూడా అనేక సభల్లో పురందేశ్వరి బంధువులకు ఈ డ్రగ్స్‌ మాఫియాతోసంబంధం ఉందని లేనిపోని   ఆరోపణలు చేశారు. ఇంకొందరు కాస్త ముందుకు వెళ్లి బ్రిజిల్‌ నుంచి సరుకు వచ్చింది గనుక వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డికి సంబంధం ఉందని, కొత్తగా ఎన్నికైన బ్రెజిల్‌ అధ్యక్షునికి విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పడమే ఇందుకు సాక్ష్యమని టీడీపీ నాయకులు ఆక్షేపించారు. ఎన్నికల వాతావరణంలో ఇరు పార్టీలూ ఈ డ్రగ్స్‌ వ్యవహారంపైనే మాటల యుద్ధాన్ని తారా స్థాయికి తీసుకువెళ్ళాయి. రాష్ట్రం ఇంతటా ఆరోపణలు ప్రత్యేరోపణలతో అతలాకుతలం అయిపోతున్నా మధ్యలో సీబీఐ మాత్రం ఎటువంటి ప్రకటనా చేయకుండా మౌనం వహించింది. విశాఖ పోర్టులో సరుకును సీజ్‌ చేసినప్పుడు మాత్రమే సీబీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్‌ పోల్‌ నుంచి సమాచారం అందుకున్నాక కస్టమ్స్‌ శాఖ సహకారంతో విశాఖ పోర్టులో కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నామని సీబీఐ ఆ ప్రకటనలో తెలిపింది. బ్రెజిల్‌లోని శాంటోస్‌ పోర్ట్‌లో ఈ కంటైనర్‌ను విశాఖలోని ఒక ప్రైవేట్‌ కంపెనీ పేరు మీద విశాఖ పోర్ట్‌కు చేరే విధంగా బుక్‌ చేశారని సీబీఐ తన ప్రకటనలో వెల్లడిరచింది. ఈ కంటైనర్‌లో బ్యాగ్‌కు 25 కేజీల చొప్పున వేయ్యి బ్యాగుల్లో 25 వేల కేజీల ఇన్‌ యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ ఉన్నట్టు  సీబీఐ చెప్పింది. అయితే ప్రాథమిక విచారణలో ఈ సరకులో నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ కలిపినట్టు తేలడంతో ఎఫ్‌ఆర్‌ఐ రిజిస్టర్‌ చేసినట్లు సీబీఐ తెలిపింది. అంతేకాదు అంతర్జాతీయ నేరగాళ్ళ నెట్వర్క్‌ ద్వారా ఇదే పద్ధతిలో నార్కోటిక్స్‌ దిగుమతి అవుతున్నాయని కూడా సీబీఐ ప్రకటించింది. అయితే ఇది జరిగి దాదాపు రెండు నెలలయినప్పటికీ ఈ కేసు విషయంపై సీబీఐ నోట మాట రాకపోవడం చర్చ నీయాంసమయింది. ఈ కేసులో ఎంతో హంగామా చేసిన సీబీఐ ఇప్పుడు ఏమైపోయిందో ఎవరికీ అర్థం కావడంలేదు. సరుకును గుజరాత్‌లోని నార్కోటిక్స్‌ ల్యాబ్‌కు పంపిందట. ఈ సరుకులో నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ వున్నాయని ఎటువంటి నిర్ధారణా కాలేదని తెలిసింది. దీంతో భూమండలం బద్దల్కెపోయేలాగా కేసును రిజిస్టర్‌ చేసిన సీబీఐ గప్‌చూప్‌ అంటూ కళ్ళు మూసుకుంది. తన పరువును తానే తీసేసుకుంది. దీనికి తోడు ఇంటర్‌ పోల్‌ సమాచారం తప్పని కూడా తేలిపోయింది. సీబీఐ కేసును పక్కన పెడితే విశాఖకు దిగుమతి అయిన కంటైనర్‌ లో సరుకు విలువ అక్షరాలా 36 లక్షల రూపాయలట. ఇది పశువులకు వేసే దాణా. ఈ పశువుల దాణాను పట్టుకొని నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ అంటూ సీబీఐ విశాఖ పరువును తీసేసింది.  ఏపీలో ఇప్పటికే పరువు పోగొట్టుకున్న సీబీఐ  ఈ డ్రగ్స్‌ కేసుతో  మరింత దిగజారిపోయింది. అంతకుమించి సీబీఐ ఈ కేసులో నవ్వుల పాలయిపోయింది!