Current Date: 04 Apr, 2026

ఎవరెస్ట్ వద్ద పర్యాటకుల్ని బురిడీ.. రూ.186 కోట్ల కుంభకోణం వెలుగులోకి

ఎవరెస్ట్ పర్వతారోహకులను లక్ష్యంగా చేసుకుని నేపాల్‌లో జరుగుతున్న భారీ బీమా కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. పర్వతారోహణకు వెళ్లే పర్యాటకుల ఆహారంలో ఉద్దేశపూర్వకంగా బేకింగ్‌ సోడా మోతాదును పెంచి, వారిలో కృత్రిమంగా ‘మౌంటెన్ సిక్‌నెస్’ (వాంతులు, విరేచనాలు) లక్షణాలు తలెత్తేలా కొందరు కుట్ర పన్నుతున్నారు. దీని ద్వారా యాత్రికులలో అత్యవసర ఆరోగ్య పరిస్థితిని సృష్టించి, వారిని మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ అనారోగ్య లక్షణాలు కనిపించగానే, తక్షణ సాయం కోసం ఎమర్జెన్సీ హెలికాప్టర్ సేవలను ఉపయోగించుకోవాలని షెర్పాలు (ట్రెక్కింగ్ సహాయకులు) పర్యాటకులపై ఒత్తిడి తెచ్చేవారు. ఇది కేవలం ట్రెక్కింగ్ కంపెనీల లాభాల కోసమేనని పోలీసులు గుర్తించారు. ఈ విధంగా సుమారు 20 మిలియన్ డాలర్లు అంటే భారత్ కరెన్సీలో రూ. 186 కోట్లు మేర బీమా సొమ్మును కొల్లగొట్టినట్లు నిర్ధారించారు. ఈ అక్రమ సంపాదనను హెలికాప్టర్ సంస్థలు, ట్రెక్కింగ్ ఏజెన్సీలు, నకిలీ వైద్య సేవలు అందించే ఆస్పత్రులు పంచుకునేవని విచారణలో వెల్లడైంది. ఈ వ్యవస్థీకృత నేరంపై జనవరిలో దర్యాప్తు ప్రారంభించిన నేపాల్ పోలీసులు, ఇప్పటికే ఆరుగురు ఎగ్జిక్యూటివ్‌లతో పాటు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఇటువంటి వరుస మోసాల కారణంగా అంతర్జాతీయ బీమా సంస్థలు ఎవరెస్ట్ సందర్శకులకు బీమా కవరేజీని నిలిపివేసే పరిస్థితి నెలకొంది. పర్యాటక రంగంపై ఆధారపడిన నేపాల్ ప్రతిష్టకు ఈ కుంభకోణం తీవ్ర నష్టం కలిగిస్తోంది.