Current Date: 05 Oct, 2024

పాఠశాలకు బాంబు బెదిరింపు పంపిన 14 ఏళ్ల విద్యార్థి

దక్షిణ ఢిల్లీలోని కైలాష్ కాలనీలోని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్‌కు శుక్రవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే విచారణ అనంతరం అది బూటకమని తేలింది. 14 ఏళ్ల బాలుడిని నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పాఠశాలకు వెళ్లడం ఇష్టం లేకనే ఈమెయిల్‌ పంపినట్లు విచారణలో పోలీసులకు తెలిపాడు. మెయిల్‌లో, బెదిరింపు నిజమైనదిగా అనిపించేలా అతను మరో రెండు పాఠశాలలను పేర్కొన్నాడు. శుక్రవారం, ఇమెయిల్ అందిన వెంటనే, ఢిల్లీలోని సమ్మర్ ఫీల్డ్స్ స్కూల్ నుండి విద్యార్థులను సురక్షితంగా తరలించారు. వివరాల ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఈమెయిల్ వచ్చింది. అయితే ఈ ఉదయం పాఠశాల తెరిచిన తర్వాతే అధికారులు ఈ మెయిల్‌ను గమనించారు. ఈమెయిల్ గురించి పాఠశాల ప్రిన్సిపాల్ షాలినీ అగర్వాల్ మాట్లాడుతూ, అధికారులు ఈమెయిల్‌ను చూసిన 10 నిమిషాల్లో విద్యార్థులను ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్‌తో పాఠశాల పరిసరాలను తనిఖీ చేయించామని ఆమె తెలిపారు.

Share