Current Date: 27 Nov, 2024

12న దేశవ్యాప్తంగా వైద్య సేవల నిలిపివేత

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని ఆర్జీ కార్‌ మెడికల్‌ కళాశాలలో జూనియర్‌ వైద్యురాలి దారుణ హత్యపై రెసిడెంట్‌ డాక్టర్లు తీవ్రంగా స్పందించారు. సోమవారం దేశవ్యాప్తంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఫోర్డా (ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌) తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆ సంఘం.. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖను పంపించింది. ఆర్జీ కార్‌ మెడికల్‌ కళాశాల వైద్యులకు మద్దతుగా ఈ చర్యను చేపట్టినట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఓ జూనియర్‌ వైద్యురాలు దారుణ హత్యకు గురయ్యారు. ఆమెపై లైంగిక దాడి చోటుచేసుకున్నట్లు ప్రాథమిక శవపరీక్షలో నిర్ధారణ అయింది. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ జూనియర్‌ వైద్యురాలు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో గురువారం రాత్రి విధుల్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రి సెమినార్‌ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు.

Share