బెంగళూరు వేదికగా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్‌పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. చివరికి ఒకే ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. 99 పరుగుల వద్ద కివీస్ పేసర్ విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. బంతి బ్యాట్ అంచుని తాకి స్టంప్స్‌కు గిరాటేయడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. మోకాలి గాయంతో రెండో రోజు మైదానాన్ని వీడిన పంత్ మూడో రోజు ఫీల్డ్‌లోకి రాలేదు. కానీ, పంత్ ఏమాత్రం తగ్గకుండా బ్యాటింగ్‌లో తన సత్తా చాటాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వికెట్‌ను కాపాడుకుంటూనే పంత్ వేగంగా పరుగులు సాధించాడు. 105 బంతుల్లోనే 99 పరుగులు సాధించాడు. నాలుగు సిక్సర్లు బాది ప్రేక్షకులను అలరించాడు.