Current Date: 07 Oct, 2024

మా గ్రామాలకు విద్యుత్ కావాలి ఆదివాసీల కాగడాల ఉద్యమం

నిద్ర హారాలు మాని  కాగడాలు పట్టుకొని రాత్రంతా ఈ ఆదివాసీ మహిళలు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తెలుసా? తమ గ్రామాలకు విద్యుత్ కావాలని. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్ళయినా వీరి గ్రామాలకు ఎటువంటి సదుపాయాలు, సౌకర్యాలు లేవు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం, రొంపిల్లి పరిధి లో  బూరిగ, చిన్నకోనిల గ్రామాల్లో కొండ దొర తెగకు చెందిన 210 మంది ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామాల్లో విద్యుత్ లేక పోవడం తో కాగడా లే ఇక్కడ విద్యుత్ దీపాలు. కటిక చీకట్లో బతికే ఈ ఆదివాసీల బతుకు దినదిన గండమే. విద్యుత్ లేదని బోరు ఏర్పాటు లేదు. దీంతో నీళ్లు లేవు. మరో పక్క దోమలు... ప్రతి నెలా దోమకాటు కు కనీసం ఏడుగురైనా దూరంలో వున్న ఎస్ కోట ఆసుపత్రి లో చేరాల్సిందే.ఈ మధ్య ఈ గ్రామాలకు చెందిన ఆవుల్ని పెద్ద పులి చంపేసింది. అయినా నష్ట పరిహారం ఇవ్వలేదు. మరోపక్క రాయపాడు గ్రామంలో నిద్రిస్తున్న యువకుడి ని పాము కాటేసింది. ఆసుపత్రి కి వెళ్లే లోపే చనిపోయాడు. అయినా అధికారులకు కనికరం లేదు. ఈ గ్రామాలకు విద్యుత్ రావాలంటే 13 కిలోమీటర్లు లైన్ వేయాలి. కానీ మూడు కిలోమీటర్ల వరకూ వేసి ఆపేసారు. 

 

Share