Current Date: 26 Nov, 2024

మా ఊరికి ఇద్దరు మేస్టర్లనివ్వండి

స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు దాటుతున్నా గిరిజనులకు విద్యాబోధన అందడం లేదు. తమ పిల్లల్ని చదివించుకునేందుకు ఆదివాసీలు ఆపసోపాలు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం తమ గ్రామాలకు ఉపాధ్యాయుల్ని పంపిస్తే తామే సౌకర్యాలు కల్పించుకుంటామని జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. పిల్లలంతా చేతులు జోడిస్తూ తమకు టీచర్లను వేయండంటూ వినూత్నంగా శుక్రవారం విన్నవించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పిన్నకోట, గుమ్మ పంచాయతీ మారుమూల   పంచాయతీల పరిధిలో  కొట్టేంగూడ, గొప్పిల  పాలెం, కడరేవు, కల్యాణ గుమ్ గ్రామాల్లో50 కుటుంబాల్లో 150మంది కొండదొర ఆదివాసీ గిరిజనులు జీవిస్తున్నారు. వీరంతా బడి చదువులకు వెళ్లాలంటే అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ మీదుగా వెళ్లాల్సి వస్తోంది.ఓ గ్రామంలో ఐదేళ్ల నుంచి పదేళ్ల వయస్సున్న 38మంది ఉన్నారు. అందుకే తమకు ఇద్దరు టీచర్లను కేటాయిస్తూ తామే షెడ్లను నిర్మించుకుని పిల్లలకు పాఠాలు చెప్పించేలా చూసుకుంటామని జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలను గ్రామస్తులు కోరుతున్నారు.