ఉత్తరాంధ్రలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో తరచుగా వినపడే పేరు బొత్స సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు. విజయనగరం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందారు. విరామం లేకుండా సుదీర్ఘకాలంగా పదవులు అనుభవిస్తున్న బొత్స సత్తిబాబు తన కుటుంబ సభ్యులతోనే జిల్లా రాజకీయాలకు నడిపించారు. భార్య రaాన్సీ రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తమ్ముడు బొత్స అప్పలనర్సయ్య 2009, 2019లో గజపతినగరం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అలాగే తన దగ్గర బంధువు బడుకొండ అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఇక మేనల్లుడు చిన్న శ్రీను జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పే నాయకుడు. ఈ మధ్య బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీనును దూరంగా పెట్టారన్న వార్తలు వున్నాయి. అయినా ఈ కుటుంబ రాజకీయాల ముందు మరో వర్గం నిలబడలేకపోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఒక వెలుగు వెలిగిన బొత్స సత్తిబాబు పవర్‌ఫుల్ నాయకుడిగా అవతరించారు. వైఎస్ చనిపోయాక ఒక దశలో ముఖ్యమంత్రి పదవికి కూడా బొత్స పోటీ పడ్డారు. అలాంటి నాయకుడు జగన్ పంచన చేరి ఆయన ముందు అందరి చోటా నాయకుల్లాగే చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. ఉత్తరాంధ్ర వైసీపీ కో`ఆర్డినేటర్లు విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలకు తలొగ్గి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది. వైసీపీలో సత్తిబాబు తనకు తాను తగ్గించుకుంటూ రోజురోజుకూ దిగజారిపోయారు. చివరకు తనకు కంచుకోటగా భావించే చీపురుపల్లిలో ఈసారి జరిగిన ఎన్నికలో చిత్తుగా ఓడిపోయారు. విశాఖ పార్లమెంటుకు వైసీపీ నుంచి పోటీకి దిగిన సత్తిబాబు భార్య రaాన్సీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. గజపతినగరంలో తమ్ముడు అప్పలనరసయ్య ఓడిపోయారు. బంధువు బడుకొండ అప్పల నాయుడు నెల్లిమర్లలో జనసేన చేతిలో దారుణంగా ఓటమి పాలయ్యారు. మొత్తం మీద కుటుంబ సమేతంగా బొత్స ఓడిపోయారు. ఇన్నాళ్ళ రాజకీయ జీవితంలో బొత్స ఉత్తరాంధ్ర ప్రజల అభిమానాన్ని పొందలేక పోయారన్నది నిర్వివాదాంశం. పదవుల కోసమే గాని ప్రజల కోసం పని చేసిన రోజులు లేనేలేవు. అందుకే బొత్స రాజకీయ జీవితానికి అపజయంతో ముగింపు పలికారు.