ఏపీ సీఎం చంద్రబాబు రాసిన లేఖపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు రిప్లై ఇస్తూ మరో లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాల గురించి చర్చించేందుకు సమావేశమవుదామంటూ చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి ఓకే చెప్పారు. ఈ మేరకుచంద్రబాబు నిర్ణయించిన తేదీ అయిన ఈ నెల 6న హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో భేటీకి ఆహ్వానిస్తున్నట్టు.. సీఎం రేవంత్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. భారతదేశంలోని అరుదైన నేతల జాబితాలో చేరారు. ఈసారి సీఎంగా మీ ప్రయాణం గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తున్నా. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ముఖాముఖి చర్చలు అవసరమని మీరు పెట్టిన ప్రతిపాదనకు పూర్తిగా ఏకీభవిస్తున్నా. నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున.. చర్చలకు మిమల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి లేఖ రాశారు.