Current Date: 02 Jul, 2024

జూనియర్ ఎన్టీఆర్‌తో ఢీకొట్టబోతున్న బాలయ్య!

నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీలను బాలకృష్ణ తీసి వేయించడంతో మొదలైన రచ్చ ఇంకా చల్లారలేదు. రానున్న దసరాకి ఈ ఫైట్ పీక్స్‌కి చేరబోతున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 'NBK 109' వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటుంది.

NBK 109ని ఈ ఏడాది అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల కాబోతుంది. దీంతో బాబాయ్-అబ్బాయ్ మధ్య పోటీ తప్పదేమోనని నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఊర్వశి రౌతేలా హీరోయిన్ నటిస్తుంటే చాందిని చౌదరి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక 'దసరా' విలన్ షైన్ టామ్ చాకో కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు.

ఈ దసరాకి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీనే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ యాక్షన్ సినిమా ఓజీ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ 'దేవర' అక్టోబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఇక ఈ రెండు సినిమాలకి పోటీగా అక్కినేని నాగ చైతన్య 'తండేల్' కూడా వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే అక్టోబర్ 11న తండేల్‌ను దించాలని మూవీ టీమ్ భావిస్తోంది.