మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈరోజు వినుకొండకు వెళ్తున్నారు. గత బుధవారం రాత్రి టీడీపీ నేతగా చెప్పబడుతున్న జిలానీ చేతిలో నడిరోడ్డుపై వైసీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకి గురయ్యారు. రెండు చేతులు నరికి, మెడపై కత్తితో వేటు వేయడంతో అతను రోడ్డుపై చనిపోయారు. దాంతో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ అక్కడికి వెళ్తున్నారు. నిజానికి ఈ ఘటన జరిగిన సమయంలో జగన్ బెంగళూరులో ఉన్నారు. కానీ విషయం తెలిశాక బెంగళూరు పర్యటనను రద్దు చేసుకుని గురువారం తాడేపల్లికి చేరుకున్నారు. అయితే.. నడిరోడ్డుపై హత్య జరగడంతో వినుకొండలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పహారా పెంచారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. జగన్ రాక సందర్భంగా పలువురు కీలక నేతలు కూడా వినుకొండకు చేరుకుంటారని తెలుస్తోంది. తాడేపల్లి నుంచి రోడ్డు మార్గాన గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా ఆయన వినుకొండకు వస్తారు. దారి పొడవునా జగన్ వాహన శ్రేణికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పై రాళ్లదాడి జరిగింది. ఫలితాల తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలపై చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి. దాంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Share