తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీ పేరు విషయంలో ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, వారు సూచించిన పేరునే ఖరారు చేస్తామని ఆమె తెలిపారు. ఈ వివరాలను 'ఎక్స్' (X) వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వెల్లడించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ 'అట్టర్ ఫ్లాప్' అయ్యిందని, వారి పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కవిత పేర్కొన్నారు. ఫార్మా సిటీ భూముల కోసం రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తామని కూడా ఆమె తెలిపారు.తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానినని, ఆయన తనయుడు రాంచరణ్ చాలా 'హంబుల్‌గా' ఉంటారని చెప్పారు. గతంలో ఇదే మెగా ఫ్యామిలీలోని పవన్ కళ్యాణ్‌పై కవిత ఘాటు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి పక్కకు జరిగి వ్యాపారంపై దృష్టి పెట్టాలన్న ఒక నెటిజన్ సూచనపై ఆమె స్పందిస్తూ.. "సోషల్ మీడియాలో ఇలాంటి నెగిటివిటీ చాలా ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలి" అని సూచించారు.