Current Date: 01 Mar, 2026

టీమిండియాను టెన్షన్ పెడుతున్న వెస్టిండీస్ రికార్డ్స్.. హైవోల్డేజ్ మ్యాచ్!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ సూపర్-8 దశలో భాగంగా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. సెమీస్ రేసులో నిలవాలంటే ఇరుజట్లకు ఈ విజయం అత్యవసరం కావడంతో ఈ పోరు ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా, షాయ్ హోప్ నేతృత్వంలోని విండీస్‌తో తలపడనుండగా.. ఈ మెగా టోర్నీలో భారత జట్టు ఈ వేదికపై ఆడుతున్న మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. గణాంకాల పరంగా చూస్తే, ఇప్పటివరకు ఈ రెండు జట్లు 30 టీ20 మ్యాచుల్లో తలపడగా, భారత్ 19 విజయాలతో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్ 10 మ్యాచుల్లో గెలుపొందగా, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. అయితే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో మాత్రం కరేబియన్ జట్టుదే పైచేయిగా ఉంది. పొట్టి ప్రపంచకప్‌లో జరిగిన 4 పోరుల్లో విండీస్ 3 సార్లు నెగ్గగా, భారత్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం జింబాబ్వేపై గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమ్ ఇండియా, అదే జోరును వెస్టిండీస్‌పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. విండీస్ బ్యాటింగ్ లైనప్‌తో అప్రమత్తంగా ఉండాలని మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ఈ చావోరేవో తేల్చుకునే పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. భారీ బడ్జెట్ అంచనాలు, అభిమానుల ఆశల మధ్య ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.