భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్, ఆమె మాజీ భర్త కరుంగ్ కోమ్ మధ్య గత కొద్దిరోజులుగా సాగుతున్న వివాదం ఇప్పుడు క్షమాపణల వరకు వెళ్లింది. తన మాజీ భర్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పురుష సమాజాన్ని, ఫుట్‌బాల్ క్రీడాకారులను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ రావడంతో మేరీ కోమ్ స్పందించారు. ఎవరినీ తక్కువ చేసే ఉద్దేశం తనకు లేదని, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఆమె కోరారు. అసలేం జరిగిందంటే, విడాకుల అనంతరం మేరీ కోమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మాజీ భర్తకు సంపాదన లేదని, తనపైనే ఆధారపడి బతికాడని ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా కరుంగ్ స్పందిస్తూ.. మేరీ కోమ్ కెరీర్ కోసం తాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా తన భవిష్యత్తును త్యాగం చేశానని, పిల్లల బాధ్యతను తానే చూసుకున్నానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఆమెపై వివాహేతర సంబంధాల ఆరోపణలు చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే "గల్లీల్లో ఫుట్‌బాల్ ఆడేవాళ్లు చాలామంది ఉంటారు" అని మేరీ కోమ్ అనడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ వివాదంపై స్పష్టతనిస్తూ మేరీ కోమ్ ఒక వీడియో విడుదల చేశారు. ద్రోహం, డిప్రెషన్ కారణంగా కలిగిన అసహనంతోనే ఆ మాటలు అన్నానని, అంతేకానీ పురుషులను లేదా ఫుట్‌బాల్ క్రీడను తక్కువ చేయాలనే ఉద్దేశం తనకు లేదని వివరించారు. తన మాటలను సోషల్ మీడియాలో తప్పుగా అన్వయించవద్దని, కేవలం తన వ్యక్తిగత బాధలోంచి వచ్చిన మాటలుగానే చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Share