హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే 12604 సూపర్‌ఫాస్ట్ రైలుకు తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రగుంట స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 2:58 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రైలుకు డేంజర్ సిగ్నల్ పడినా ఆగకుండా లోకో పైలట్లు సుమారు అర కిలోమీటరు దూరం ముందుకు తీసుకెళ్లారు. అదృష్టవశాత్తూ అదే సమయంలో ఎదురుగా ఇతర రైళ్లు లేకపోవడంతో పెను ముప్పు తప్పినట్లయింది. ఈ ఘటనను గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్టేషన్ నుంచి ఘటనా స్థలానికి చేరుకుని రైలును నిలిపివేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లను తక్షణమే విధుల్లో నుంచి తొలగించి, వారి స్థానంలో ప్రత్యామ్నాయ సిబ్బందిని ఏర్పాటు చేశారు. కొత్త సిబ్బంది వచ్చిన తర్వాతే రైలుకు ముందుకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. దీంతో రైలు ప్రయాణికులు కొంత సమయం పాటు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే శాఖ సీరియస్‌గా స్పందించింది. డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు, వైద్య బృందాలు సంబంధిత లోకో పైలట్లను రహస్యంగా విచారిస్తున్నారు. వారు నిద్రమత్తులో ఉన్నారా లేక సాంకేతిక లోపం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నల్ జంప్ అనేది రైల్వేలో అత్యంత తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు కాబట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Share