ప్రస్తుత జనరేషన్‌లో టాటూల క్రేజ్ విపరీతంగా పెరిగింది. చేతులు, మెడ, వీపు, ఇలా శరీరంలోని అనేక చోట్ల టాటూలు వేయించుకుంటున్నారు. కొంత మంది తమకు ఇష్టమైన వ్యక్తుల పేర్లను తమ శరీరాలపై టాటూలుగా వేయించుకుంటారు. మరికొందరు తమ శరీరాలపై రకరకాల డిజైన్లను టాటూలుగా వేయించుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది యువకులు తమ శరీరాలపై వింత వింత టాటూలు కూడా వేయించుకుంటున్నారు. పురుషులు, మహిళలు అనే తేడా లేదు. అందరూ ఇప్పుడు టాటూలు వేసుకుంటున్నారు. అయితే మీకు తెలుసా.. మీ శరీరంపై ఎక్కడైనా టాటూ ఉంటే కొన్నిసార్లు రక్తదానం చేయడం సమస్యగా మారుతుంది. ఎందుకంటే టాటూ వేయించుకున్న వారి రక్తం ఎక్కించుకుంటే అంటువ్యాధులు వస్తాయని భావించి వారి దగ్గర రక్తం తీసుకునే వారు కాదు. కానీ, ప్రస్తుతం ఈ విధానం మారిపోయింది. రక్తదానం చేసే ప్రతి 100 మందిలో 90 మందికి టాటూస్ ఉంటున్నాయి. కాబట్టి, దీనిపై రెడ్ క్రాస్ వారు కొన్ని నియమాలను విధించారు. ఎవరైనా టాటూ వేయించుకుంటే ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు వారు రక్తదానం చేయటానికి వీల్లేదు. 12 నెలల తరువాత వారు రక్తదానం చేయటానికి అర్హులుగా సూచించారు.