ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అవడం చాలా కామన్‌గా జరిగేదే. టీచర్ బదిలీపై వెళ్తుంటే పిల్లలు ఎమోషనల్ అవుతుండటం కూడా మనం చూస్తుంటాం. కానీ.. మంచిర్యాల జిల్లాలో మాత్రం ఓ స్కూల్ టీచర్ బదిలీపై మరో స్కూల్‌కు వెళ్తుంటే విద్యార్థులు సైతం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తీసుకుని ఆ స్కూల్‌కి వెళ్లిపోయారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 100 మందికి పైగా విద్యార్థులు తమ గురవు వెళ్లిన స్కూల్లోనే అడ్మిషన్ తీసుకున్నారు.మంచిర్యాల జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక పాఠశాలలో జాజాల శ్రీనివాస్ 2012లో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా చేరారు. అప్పటి నుంచి ఆయన అక్కడే విద్యార్థులకు చదువు చెబుతున్నారు. అయితే శ్రీనివాస్ జాయిన్ అయ్యే సమయానికి అక్కడ ఐదు తరగతులకు గాను ఇద్దరు టీచర్లు, 32 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. శ్రీనివాస్ పిల్లలతో చాలా ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతూ, ఆటపాటలతో వారికి ఈజీగా అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించేవాడు. ప్రతి ఒక్క విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపించేవాడు. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపించటం మానేసి ప్రభుత్వ స్కూల్లోనే చేర్పించేవారు. దీంతో పొనకల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 250కి చేరింది.