Current Date: 26 Nov, 2024

ఏపీలో పెన్షన్లు పెరిగాయ్ జీవో జారీ చేసిన ప్రభుత్వం

అవును.. అటు సంతకం.. ఇటు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు. అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది. దీంతో పెన్షన్ దారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పేదల పింఛన్‌ మొత్తాన్ని రూ.3వేల నుంచి ఒకేసారి రూ.4వేలకు పెంచారు. చంద్రబాబు తన మూడో సంతకాన్ని ఈ ఫైలుపైనే చేశారు. 2019లోనే చంద్రబాబు పింఛను రూ.2వేలు చేశారు. దీనిని 3వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌... ‘విడతలవారీ’ పాట పాడిన సంగతి తెలిసిందే. ఏటా రూ.250చొప్పున పెంచుతూ.ఐదేళ్లలో రూ.3వేలు చేశారు. కాగా..చంద్రబాబు ఇప్పుడు ఒకే విడతలో రూ. వెయ్యి పెంచేశారు. దీనివల్ల 66లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. మేం అధికారంలోకి వస్తే ఏప్రిల్‌ నుంచే పెరిగిన పింఛను అమలుచేస్తామని... ఈ మొత్తాన్ని కూడా కలిపి జూలైలో రూ.7వేలు ఇస్తామని చెప్పాం. దీనిప్రకారం... జూలైలో ఈ 3నెలల బకాయి 3వేలు, పెరిగిన పింఛను రూ.4వేలు కలిపి మొత్తం 7వేలు అందుతాయి. అలాగే దివ్యాంగుల పింఛను రూ.4వేల నుంచి 6 వేలకు పెంచుతున్నాం. వారికి బకాయిలతో కలిపి జూలైలో రూ.12 వేలు అందుతుందని చంద్రబాబు వివరించారు.

Share