Current Date: 15 Feb, 2026

పదో తరగతి పరీక్షలు రాయబోతున్న భారత క్రికెటర్

టీనేజ్ క్రికెట్ సంచలనం, భారత అండర్-19 జట్టు స్టార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో పరుగుల వరద పారించి, ఇప్పుడు పరీక్షల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యాడు. జింబాబ్వే వేదికగా జరిగిన అండర్-19 వన్డే ప్రపంచకప్ 2026లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన ఈ 14 ఏళ్ల కుర్రాడు.. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి బోర్డు పరీక్షలు రాయనున్నాడు. nబిహార్‌లోని సమస్తిపుర్‌లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వైభవ్ ఈ పరీక్షలకు హాజరుకాబోతున్నాడు. వైభవ్ రాక నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అతడు ఇప్పటికే పాపులర్ క్రికెటర్ కావడంతో, పరీక్షా కేంద్రం వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉందని భావించి తగిన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ప్రిన్సిపల్ నీల్ కిశోర్ తెలిపారు. పరీక్షా గదిలో మాత్రం వైభవ్‌కు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఉండవని, మిగిలిన విద్యార్థుల మాదిరిగానే సాధారణ నియమ నిబంధనల మధ్యే అతడు పరీక్షలు రాస్తాడని ఆయన స్పష్టం చేశారు. ఈ 'అకడమిక్ పిచ్' పై కూడా వైభవ్ రాణించాలని టీచర్లు, తోటి విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు.