టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే జట్టు పెను సంచలనం సృష్టించింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే, బ్రియాన్ బెన్నెట్ (64*) హాఫ్ సెంచరీతో 169 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 146 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరాబానీ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. జింబాబ్వే సాధించిన ఈ చారిత్రక విజయం ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. దీనికి కారణం గతంలో ఉన్న ఒక బలమైన సెంటిమెంట్. ప్రపంచకప్ టోర్నీల్లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించిన ప్రతిసారీ భారత్ విజేతగా నిలిచింది. 1983 వన్డే ప్రపంచకప్‌లో జింబాబ్వే తొలిసారి ఆసీస్‌ను ఓడించినప్పుడు కపిల్ దేవ్ సేన కప్ గెలిచింది. అలాగే, 2007 తొలి టీ20 ప్రపంచకప్‌లోనూ జింబాబ్వే ఆసీస్‌కు షాకివ్వగా, ధోనీ నేతృత్వంలోని భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. ఇప్పుడు 2026లో కూడా అదే సీన్ రిపీట్ కావడంతో, భారత్ మూడోసారి టీ20 ఛాంపియన్‌గా నిలవడం ఖాయమని అభిమానులు తేల్చేస్తున్నారు.