వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక చిన్న కాఫీ వివాదం తీవ్ర దుమారం రేపింది. మున్సిపల్ అధికారి అత్యుత్సాహాం ప్రదర్శించగా.. హోటల్ యజమాని పోరాటానికి దిగాడు.ఏం జరిగిందంటే? పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న ఒక హోటల్‌కు వెళ్లిన మున్సిపల్ అధికారి, ఒక కాఫీని '1/3' (ముగ్గురికి పంచమని) అడిగారు. అయితే తమ వద్ద అటువంటి సదుపాయం లేదని హోటల్ యజమాని నిరాకరించడంతో, దీనిని వ్యక్తిగతంగా తీసుకున్న సదరు అధికారి ఆగ్రహంతో ఊగిపోయారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే పొక్లెయిన్‌ను రప్పించిన సదరు అధికారి, హోటల్ ముందున్న ర్యాంప్ అక్రమంగా ఉందని పేర్కొంటూ దానిని తొలగించే ప్రయత్నం చేశారు. పట్టణంలో కాలువలపై ఉన్న అన్ని ర్యాంప్‌లను వదిలేసి, తన హోటల్‌నే లక్ష్యంగా చేసుకోవడంపై యజమాని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అధికార దుర్వినియోగమేనని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ముదురడంతో హోటల్ యజమాని ఏకంగా రోడ్డుపై పడుకుని పొక్లెయిన్‌ను అడ్డుకున్నారు. తనపై నుంచి వాహనాన్ని పోనిచ్చి ర్యాంప్‌ను తొలగించాలని ఆయన భీష్మించుకోవడంతో అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు.