రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో వివాహమైన మూడు నెలలకే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన యువతి ఉదంతం కలకలం రేపింది. మేఘాలయ ‘హనీమూన్ హత్య’ను తలపిస్తున్న ఈ ఘటనలో అంజూ అనే మహిళ, తన భర్త ఆశిష్‌ను పక్కా పథకం ప్రకారం అంతం చేసింది. రాత్రి సమయంలో భర్తను నిర్మానుష్య ప్రాంతానికి వాకింగ్‌కు తీసుకెళ్లి, అక్కడ మాటు వేసిన ప్రియుడు సంజూ, అతని స్నేహితులతో కలిసి దాడి చేయించి ప్రాణాలు తీయించింది. హత్య అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు అంజూ తీవ్రంగా ప్రయత్నించింది. గుర్తుతెలియని వాహనం తమను ఢీకొట్టిందని, దుండగులు తన నగలు దోచుకెళ్లారని పోలీసులను నమ్మించే నాటకమాడింది. అయితే, ఆశిష్ ఒంటిపై తీవ్రమైన గాయాలు ఉండటం, అదే సమయంలో అంజూకు చిన్నపాటి గాయాలు కూడా కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమె చెప్పిన వివరాలకు, ఘటనా స్థలంలోని ఆధారాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు ఆమెను తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. పోలీసుల విచారణలో పెళ్లికి ముందే ఆమెకు సంజూతో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేలింది. వివాహం తర్వాత కూడా ప్రియుడితో సంబంధం కొనసాగించిన అంజూ, భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నింది. నగల కోసమే దాడి జరిగిందని నమ్మించడానికి తన చెవి కమ్మలు, ఫోన్‌ను ప్రియుడికి ఇచ్చి పంపి, తాను స్పృహ తప్పినట్లు నటించినట్లు విచారణలో అంగీకరించింది. ఈ దారుణానికి పాల్పడిన అంజూతో పాటు ఆమె ప్రియుడు, స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు.
Share