Current Date: 28 Nov, 2024

దువ్వాడపై వేటు వేసిన వైసీపీ.. కొంపముంచిన కుటుంబ పంచాయితీ

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకుంది. గత కొన్ని రోజులుగా కుటుంబ వివాదాలతో పార్టీ పరువు తీస్తున్న దువ్వాడను టెక్కలి వైసీపీ ఇంఛార్జి స్థానం నుంచి తొలగిస్తూ వైయస్‌ఆర్‌సీపీ నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో పేరాడ తిలక్‌‌ను టెక్కలి ఇంఛార్జిగా నియమించింది.దివ్వెల మాధురి అనే మహిళతో సన్నిహితంగా ఉంటున్నారంటూ ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి, కుమార్తెలు ఆందోళనకు దిగటంతో వివాదం తెరపైకి వచ్చింది. దివ్వెల మాధురి కూడా తాను దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటానంటూ తెగేసి ఆత్మహత్యకు యత్నించడంతో దుమారం రేగింది.పార్టీకి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే దువ్వాడ శ్రీనివాస్‌ను టెక్కలి వైసీపీ ఇంఛార్జి పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడుపై దువ్వాడ శ్రీనివాస్ పోటీచేసి 34 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. నూతన ఇంఛార్జిగా నియమితులైన పేరాడ తిలక్ కూడా 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున పోటీ చేసి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు.

Share