మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ తెలుగు రాష్ట్రాలను తన కవితలతో ఉర్రూతలూగించిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. తెల్లవారుజామున తన నివాసంలో 64 ఏళ్ల అందెశ్రీ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యులు ఆయనను పరీక్షించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.తెలంగాణలోని జనగాం దగ్గర రేబర్తి అనే గ్రామంలో రచయిత అందెశ్రీ జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య.. జయ జయహే తెలంగాణ గీతాన్ని రచించారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోవత్సం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందెశ్రీ అందుకున్నారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో అందెశ్రీ మంచి పేరు తెచ్చుకున్నారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా గుర్తించింది.