బషీర్ బెల్.. ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. ప్రాంతంతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఫొటోలు తీస్తుంటారు. ఇటీవల రద్దీ ప్రాంతంలో ఫొటోలు తీస్తుండగా రూ.1.20 లక్షలు విలువైన అతని సెల్‌ఫోన్ మాయమైంది. నిమిషాల్లోనే గుర్తించిన బషీర్ వేరొక నెంబరు నుంచి ఫోన్ చేస్తే స్విచ్‌ఆఫ్ అని వచ్చింది. రోజుల వ్యవధిలో ఆ ఫోన్ సుడాన్‌లో తేలింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు సెల్‌ఫోన్ దొంగలు పెరిగిపోయారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమాహాళ్లు.. లాంటి రద్దీ ప్రాంతాల్లోనూ ఫోన్ల చోరీ మామూలు విషయంగా మారింది. కొందరు దొంగలు ప్రయాణికుల్లా బస్సుల్లో ఎక్కుతూ ఫోన్ కొట్టేసి వెంటనే దిగిపోతున్నారు. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 4,615 సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో డీసీపీ స్థాయి అధికారి సెల్‌ఫోన్‌నే ఈ ముఠా దొంగలించేసింది. చోరీ చేసిన సెల్‌ఫోన్లను వాటి మోడల్‌ను బట్టి ధర నిర్ణయించి కొనే ముఠాలు కొన్ని హైదరాబాద్‌లోని అబిడ్స్ జగదీశ్ మార్కెట్ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి. టెక్నీషియన్ల సహకారంతో వాటి ఐఎంఈఐని మార్చేసి షిప్‌ల ద్వారా ఆఫ్రికా దేశాలకు తరలించేస్తున్నారు.