విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జన వాహిని తరలి వచ్చింది. ఉక్కు ప్రైవేటీకరణ యోచనను ఉపసంహరించుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ నేతృత్వంలో బుధవారం ఉదయం ప్రారంభమైన ర్యాలీ జన సంద్రంతో నిండిపోయింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు శాంతి ర్యాలీ చేరుకోగా, మార్గ మధ్యంలో ప్రజలు ఈ యాత్రకు నీరజనాలు పలికారు. పాదయాత్రకు ముందు ప్రజా కళామండలి, అరుణోదయ కళాకారుల పాటలు, నృత్యాలు అందర్నీ ఆకట్టుకొని, ఆలోచింపజేశాయి. ఈ మహా ప్రజా ఉద్యమ ర్యాలీకి సంఫీుభావంగా దారి పొడవునా పలు వ్యాపారులు మద్దతు పలికారు. నగరంలో పేరుగాంచిన వైభవ్ జ్యూయలర్స్, లలితా జ్యూయలర్స్ సిబ్బంది దుకాణాల నుంచి బయటకు వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ ర్యాలీకి పాదయాత్రలో సంఫీుభావం తెలియజేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు మహా పాదయాత్ర చేరగానే ఉద్యమ పండగ వాతావరణం నెలకొంది.