Current Date: 25 Nov, 2024

ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం... లుకౌట్‌ నోటీసులు జారీ...

మాచర్ల ఈవీఎం ధ్వంసం ఘటనపై సీరియస్ అయిన సీఈసీ.. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆయనను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు వెళ్లాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మూడు చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నెల్లి మీద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్ల నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ కింద 143, 147, 448 427, 353, 452, 120b సెక్షన్లతో కేసు నమోద చేయగా.. పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదైంది. ఆర్పీ యాక్ట్ కింద 131, 135 సెక్షన్లను నమోదు చేశారు. ఈ నెల 20వ తేదీనే పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టులను ఏపీ పోలీసులు అప్రమత్తం చేశారు. లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు పిన్నెల్లి తక్షణమే అరెస్ట్‌ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.