Current Date: 22 Jun, 2026

గురుద్వారాలో నిహంగ్‌ సిక్కుల హైడ్రామా.. భక్తుడ్ని బంధించి నిరసన

ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌ గురుద్వారాపై సాయుధులైన ఆరుగురు నిహంగ్‌ సిక్కులు దాడికి దిగి, ఓ వృద్ధ సిక్కు భక్తుణ్ని నిర్బంధించడం తీవ్ర కలకలం రేపింది. బందీగా ఉన్న ఆ వృద్ధుడిని గురుద్వారా పైకప్పు మీదకు తీసుకెళ్లిన నిహంగులు.. పోలీసులు అరెస్టు చేసిన తమ నలుగురు సహచరులను తక్షణమే విడుదల చేయాలని డిమాండు చేశారు. ఈ వివాదానికి అసలు కారణం ఈ నెల 16న చమోలీ జిల్లాలో జరిగిన ఒక ఘటనే. పంజాబ్‌కు చెందిన నిహంగ్‌ సిక్కులు హిమాలయాల్లోని శ్రీ హేమ్‌కుండ్‌ సాహిబ్‌ గురుద్వారాను సందర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా, ఒక హోటల్‌ వద్ద పార్కింగు విషయమై స్థానికులతో గొడవ జరిగింది. ఈ గొడవ తర్వాత పోలీసులు నలుగురు నిహంగులను అరెస్టు చేశారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ధర్నా ద్వారా నిరసన తెలిపేందుకు సహకరించాలని నిహంగులు స్థానిక గురుద్వారా నిర్వాహకులను కోరారు. ఇందుకు వారు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన నిహంగులు ఈ దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం రుద్రప్రయాగ్‌ గురుద్వారా ముందు భారీగా పోలీసులు మోహరించారు. నిహంగ్‌ సిక్కులు పైకప్పు మీదకు ఎవరూ రాకుండా మూడో ఫ్లోరుకు తాళం వేసి, కిందికి దిగేందుకు ససేమిరా అనడంతో పోలీసులు వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.